న్యూఢిల్లీ, జూలై 28: ఇటీవల విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న వారిపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ర్టాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అలాగే ఎటువంటి నేర చరిత్ర లేని పక్షంలో 18 ఏండ్ల లోపు వయసున్న మైనర్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షలలో అవకతవకలు, నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయమై నిష్పాక్షిక, స్వతంత్ర విచారణ అవసరమని పేర్కొంది.
ఎవరైతే దురాగతాలకు పాల్పడి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారో వారిపై చర్య తీసుకోవాలి అని జస్టిస్ జోయ్‌మాల బాగ్చి, వీ మోహనలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెల్లెట్ గన్లు, మేకులున్న లాఠీలు, ఎలక్ట్రిక్ లాఠీల వాడకం వల్ల పలువురు విద్యార్థులు, యువతులకు తీవ్రమైన, ప్రాణాంతకమైన గాయాలైనట్లు వచ్చిన ఆరోపణలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అన్ని ఆరోపణలపై ఒక టాస్క్ ఫోర్స్ ద్వారా స్వతంత్ర, పారదర్శక, సమగ్ర విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం 250 మంది పోలీసులపై జరిగిన దాడుల గురించి, అలాగే ఆ దాడులు విద్యార్థుల వల్ల జరిగాయా లేక కొందరు దుండగుల వల్ల జరిగాయా అన్న విషయాలను నిర్ధారించడానికి కూడా విచారణ అవసరమని తెలిపింది.
విద్యార్థుల నిరసనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ రికార్డింగ్‌లు, బాడీ కెమెరా ఫుటేజ్, వైర్లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ లాగ్‌లు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచాలని నిరసనలు జరిగిన రాష్ర్టాలను ఆదేశిస్తూ ధర్మాసనం పలు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పోలీసు సిబ్బందిపై విద్యార్థులు హింసకు పాల్పడరని, అయితే కొంతమంది దుండగులు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని అన్నారు. విద్యార్థులు ఏదైనా ఇబ్బందికి గురై ఉంటే అందుకు బాధ్యులైన వారిని తప్పక శిక్షించాలని ఆయన చెప్పారు.