అసెంబ్లీ ఎన్నికల్లో అర చేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక హామీలను అటకెక్కించింది. అధికార పగ్గాలు చేపట్టి ఏడాది దాటినా చెప్పిన స్కీమ్‌లను పట్టించుకోవడం లేదు. పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలతోపాటు కీలకమైన అనేక హామీలు అమలుకు నోచడం లేదు. కొత్త సంవత్సరంలోనైనా పథకాల అమలు చెయ్యాలని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వంలోకి వచ్చాక ఆయా పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంది. అందుకోసం గతేడాది డిసెంబర్ 28న ప్రజా పాలన కార్యక్రమం తీసు కొచ్చింది. జిల్లావ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా 12.06 లక్షల అప్లికేషన్లు రాగా, ఇప్పటి వరకు పథకాలను మాత్రం అమలు చేయడం లేదు.
ఆడబిడ్డలకు మొండిచెయ్యి
18ఏండ్లు పైబడిన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లో రూ.2500 హామీ ఎంతో ప్రభావితం చేసింది. ఈ పథకానికి జిల్లాలో 2.32 లక్షల మంది ఆడబిడ్డలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ ప్రారంభించనే లేదు. కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా లక్ష రూపాయల సాయంతోపాటు తులం బంగారం వాగ్దానం చేసినా ఆ ప్రస్తావనే లేదు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.
రైతులపై నిర్లక్షం..
రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సీజన్‌కు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇది కౌలు రైతులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేగాక వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చినా.. నగదు మాత్రం ఎకరాకు రూ.5 వేల చొప్పున మాత్రమే విడుదల చేసింది. అది కూడా ఒక్క సీజన్లోనే ఇచ్చింది. వానకాలం పంటకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తున్నా.. ఏవో ముచ్చట్లు చెప్తూ కాలం వెల్లదీస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సీజన్లో 2.23 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు ఠంఛనుగా పడేవి.
త్యాగాలకు గుర్తింపేది?
తెలంగాణ అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం హామీ కూడా అమలుకు నోచడం లేదు. జిల్లాలో ప్రజా పాలన సందర్భంగా 388 దరఖాస్తులు రాగా, వీటిని పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఉద్యమకారులకు సైతం 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పినా ఉలుకూ పలుకూ లేదు. దీని కింద జిల్లాలో 2,616 మంది ఉద్యమకారులు అప్లికేషన్ పెట్టుకున్నారు.
పింఛన్ల పెంపు ఇంకెప్పుడు?
ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.2 వేల పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. రూ.4వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతామని చెప్పింది. ఈ హామీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని ప్రకటించింది. కానీ ఏడాది దాటినా పాత పింఛనే ఇస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 65వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గీతకార్మికులు, హెచ్ఐవీ, బోధకాల బాధితులు, డయాలసిస్ రోగులు పింఛన్ ఎప్పుడు పెంచుతారా అని ఎదురుచూస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు ఎన్నాళ్లకు?
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్న కాంగ్రెస్.. తొలి విడుతలో సొంత స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులకు ఇస్తామని చెప్పింది. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,01,977 దరఖాస్తులు వచ్చాయి. వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు. ఇండ్ల స్థలాలకు సాయం ఎప్పుడు ఇస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
యువ వికాసానికి పైసా ఇవ్వలే..
అభయ హస్తంలో భాగంగా యువ వికాసం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. దీని కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో విద్యా భరోసా కార్డులో 5లక్షలు డిపాజిట్ చేస్తామని గప్పాలు కొట్టింది. కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విడుదల చేసింది లేదు.