నీలగిరి, జూలై 18 : నేత్రాలు దానం చేయడంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు అన్నారు. మరణానంతరం నేత్ర దానానికి ప్రజలు సహకరిస్తూ ముందుకు రావాలని కోరారు. నల్లగొండ పట్టణంలోని శివరాంనగర్ కాలనీకి చెందిన రావిరాల లక్ష్మమ్మ(69) శుక్రవారం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యుల సహకారంతో నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరణానంతర నేత్రదానం ద్వారా ఇద్దరు కార్నియా అంధులకు కంటి చూపును అందించవచ్చని తెలిపారు.
గడిచిన 8 నెలల కాలంలో 150 మంది దాతల నుండి సేకరించిన 300 కార్నియాలతో 300 మందికి కంటి చూపును అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునే వారు 99481 43299, 96408 07775 నంబర్లను సంప్రదిచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ, ఐ డొనేషన్ సెంటర్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, యాదగిరి, మురళీ, స్వాతి, సంధ్య, నిర్మల, మాధవి, నర్సింహ్మ, మధు పాల్గొన్నారు.