సూర్యాపేట, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : జాజిరెడ్డిగూడెం, వంగమర్తి ఏటి నుంచి అనుమతులు లేకుండా లారీల కొద్దీ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. పట్టపగలే పెద్ద సంఖ్యలో జేసీబీలతో వాగు పరిసరాల్లో పెద్దఎత్తున ఇసుక డంపులు ఏర్పాటు చేసి లారీలను లైన్లో పెట్టి ఇసుకను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత ఎన్నికల ముందు తట్టెడు ఇసుకను కూడా వాగు నుంచి తీయనీయను అని వాగ్దానం చేసిన స్థానిక ఎమ్మెల్యే మాత్రం గమ్మునుండడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ సర్పంచ్ ఇసుక డంపుల వద్దకు వెళ్లి సుమారు 4 నిమిషాల నిడివిగల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని వంగమర్తి, జాజిరెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇసుక పెద్దఎత్తున లభ్యమవుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ అధికారిక రీచ్లు ఏర్పాటు చేసి అవసరాల మేరకు ఇసుకను రవాణా చేసేవారు. అలాంటిది ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అధికారిక రీచ్లు లేకపోయినప్పటికీ వందలాది లారీల్లో ప్రతినిత్యం సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకను తరలిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ నారగోని అంజయ్యగౌడ్ ఇసుక అక్రమ రవాణా అయ్యే చోటుకు వెళ్లి ఇసుక డంపులు, లారీలు, జేసీబీలను చూపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆయన వీడియోలో ‘ఏడో తారీఖు ఆరోనెల ఇదే రోజు బ్రహ్మాండంగా ఇసుక లారీలు పెద్ద ఎత్తునపోతున్నాయి.. ఎమ్మెల్యేగారూ మీరు గెలవక ముందు చెప్పారు, గెలిచినంక చెప్పారు. దీనిపై మా గ్రామాల వారందరం కలిసి మీకు ఓట్లేసి గెలిపిస్తే మరి మీరు ఎక్కడ పండారు. మూడు రోజుల నుంచి పెద్దఎత్తున ఇసుక రవాణా నడుస్తున్నది. మీరు వెంటనే వచ్చి ఇసుక రవాణాను నిలిపివేయాలని పిలుపునిస్తే మేం కూడా మీ వెంట ఉండి లారీలను నిలిపివే స్తాం. మీరు వెంటనే బంద్ చేయించాలి. లేదం టే ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో కూడా తిరుగనివ్వరు. ఇట్లు మీ నారగోని అంజయ్య, లక్ష్మిదేవి కాల్వ, మాజీ సర్పంచ్. ఈ ఏటి వెంట ఉన్న గ్రామాల ప్రజలంతా చైతన్యవంతులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ముగించారు.
ఇసుక అక్రమ రవాణా విషయమై శాలిగౌరారం తాసీల్దార్ అన్వర్హుస్సేన్ను వివరణ కోరగా ఏటిలో ఎలాంటి రీచ్లకు అనుమతి లేదని, లారీల ద్వారా అస్సలే ఇసుక రవాణా చేయకూడదని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలకు మాత్రం ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించేందుకు ఆన్లైన్ పద్ధతిన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. లారీల్లో ఇసుక తరలిస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.