కొంతకాలంగా శుభ ఘడియలు లేక వివాహాలు జరుగలేదు. బుధవారం నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. జూన్ వరకు మంచి దినాలు పుష్కలంగా ఉండడంతో పెండ్లిళ్ల సందడి మొదలైంది. అయితే.. పెండ్లి ఆహ్వానాల్లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. గతంలో పెండ్లి పత్రికలు అచ్చు వేయించి ఇంటికి వెళ్లి స్వయంగా ఇచ్చి ఆహ్వానించేవారు. ఇప్పుడు వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపుతున్నారు.
– రామగిరి, మే 3
Marriages | మారిన కాలానికి అనుగుణంగా పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల ఆహ్వానాల్లో చాలా మార్పులు వచ్చాయి. గతంలో పెండ్లి పత్రికపై సీతారాముల బొమ్మలు ఉండగా.. ఇప్పుడా స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. సింగిల్ కలర్ నుంచి మల్టీకలర్ ఫొటోలతో పెండ్లి కార్డులు అచ్చవుతున్నాయి. గతంలో ఇంటికెళ్లి పెండ్లి పత్రిక ఇవ్వగా.. ఇప్పుడు ఫోన్లోనే పంపుతున్నారు. ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక, ఆహ్వానితుల వివరాలతో చివరగా డేట్ సేవ్ చేసుకోండి అంటూ వీడియో ప్లే అవుతుంది. వాట్పాప్‌లో గ్రూప్ కాల్ చేసి సమయభావంతో వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నామంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెండ్లికి తప్పకుండా హాజరు కావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది.
వాట్సాప్ గ్రూపుల్లో పెండ్లి సందడి
పురోహితుడు లగ్నపత్రిక రాసిన మరుసటి రోజు నుంచి ఇంట్లో పెండ్లి సందడి ప్రారంభమైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెండ్లి తేదీ, సమయం, వేదికతోపాటు అన్ని అంశాలు తెలిపేలా ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేస్తున్నారు. అందులో బంధువులు, స్నేహితుల ఫోన్ నెంబర్లు చేర్చి పెండ్లి సందడి ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలు చూసిన వారికి తాము కూడా వేడుకకు వెళ్లాలనిపిస్తుంది. అదేవిధంగా ఫంక్షన్లలో ప్రత్యేక డ్రెస్‌కోడ్ వాడుతున్న పరిస్థితి.
ఈ నెలలో పుష్కలంగా ముహూర్తాలు
ఈ నెలలో ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయి. మే 3వ తేదీ నుంచి 16వరకు, అదేవిధంగా 20నుంచి 31వరకు, జూన్‌లో 1, 3, 7, 8, 9 తేదీల్లో శుభ ఘడియలు ఉన్నాయి. జూన్ 19నుంచి ఆషాఢం, జూలై 18 నుంచి అధిక శ్రావణ మాసం రావడంతో శుభ కార్యాలు ఉండవు. ఆగస్టు 17నుంచి నిజ శ్రావణ మాసంలో 18వ తేదీ తర్వాత శుభ కార్యక్రమాలు పునఃప్రారంభమవుతాయి.
గతంలో సైకిల్‌పై వెళ్లి పత్రికలు ఇచ్చేది
గతంలో పెండ్లి వేడుక వస్తే నెల రోజుల మందుగానే ప్రింటింగ్ ప్రెస్‌లో కార్డులు అచ్చు వేయించేది. మా నాన్నవాళ్లు సైకిళ్లపై ఊరూరా తిరిగి బంధువులకు కార్డులు ఇచ్చేవాళ్లు. చాలా దూరమైతే బస్సులో వెళ్లేవారు. దగ్గరి గ్రామాలైతే నడుచుకుంటూ పోయేది. బంధువులు అందుబాటులో లేకపోతే పక్కింటి వాళ్లకు ఇచ్చేది. లేదంటే దర్వాజకు బొట్టు పెట్టి కార్డును అక్కడే పెట్టేవారు. ఇప్పుడా సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. నోటి మాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. వాట్సాప్‌లోనే పెండ్లి కార్డులు పంపిస్తుండ్రు.
– బత్తుల వీరప్ప, నల్లగొండ
మే నెలలో వివాహ ముహూర్తాలు అధికమే
మే నెలలో దాదాపు 21 ముహూర్తాలున్నాయి. ఇప్పటికే పెండ్లిళ్లు చేయాలనుకునే వారు ముహూర్తాలు నిర్ణయం చేసుకుని బ్రాహ్మణులను బుకింగ్ చేసుకున్నారు. అంతా బిజీబిజీగా ఉన్నారు. జూన్‌లో ఐదు ముహూర్తాలున్నాయి. అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంది.
– పెన్నా మోహనశర్మ, ప్రముఖ పురోహితుడు, నల్లగొండ