నల్లగొండ రూరల్, అక్టోబర్ 09 : సమాజంలో మేమెంత మందిమో మాకంత వాటా దక్కాల్సిందేనని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ఆదిపత్య శక్తుల కుట్రలను తిప్పి కొడుతామని తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ పట్టణంలోని చౌరస్తా వద్ద ఉన్న పూలే విగ్రహం ముందు 42 శాతం రిజర్వేషన్ పట్ల ఆదిఫత్య శక్తుల కుట్రలను నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు చేసిన ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ పై అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ వద్దకు పంపడం జరిగిందన్నారు. కానీ ఆదిపత్య శక్తులు అడుగడుగునా రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటుయని దుయ్యబట్టారు. 60 శాతానికి పైబడి ఉన్న బీసీలు 42 శాతానికి అంగీకరించినప్పటికీ కూడా అడ్డుకోవడం ముమ్మాటికీ ఆదిపత్య శక్తుల కుట్రలే అన్నారు.
ఆదిపత్య శక్తులు, ఇదే బీజేపీ ప్రభుత్వం ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా 2022లో 103వ రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం పరిమితిని ఉల్లంఘించి ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు పొందారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని వారు ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలోనూ ఎక్కడా కూడా 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటోద్దని పేర్కొనలేదన్నారు. 2022లో జనహిత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం పెంచడంపై ఆనాటి బీజేపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ 50 శాతం పరిమితి అనేది సాధారణ నియమం మాత్రమే కానీ చట్టంలో ఎక్కడా పేర్కొనబడలేదంది. అదేవిధంగా చండ్రచూడు ధర్మాసనం రిజర్వేషన్ల విషయంలో తీర్పునిస్తూ 50 శాతం రిజర్వేషన్ అనేది సాధారణ నియమం మాత్రమే కానీ, దాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పిందన్నారు.
నేడు దేశంలో 5 శాతం లేని ఆధిపత్య శక్తులు 10 శాతం ఫలాలు అనుభవిస్తున్నప్పుడు, 70 శాతం ఉన్న బహుజన వర్గాలు 42 శాతం అనుభవించడంలో ఎట్లా అన్యాయమైతుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు కల్పించబడుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు అతీతం అన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన తమ వాటా తమకు అందకుండా ఆధిపత్య శక్తులు కుట్రలు చేస్తున్నారని, రాబోయే కాలంలో జరగబోయేది రణరంగమే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జోగు నగేశ్ ముదిరాజ్, బీసీ రాజ్యాధికార సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గడగోజు విజయకుమార్, పట్టణ అధ్యక్షుడు చిన్నోజు రాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కన్నబోయిన రాజు యాదవ్, పొగాకు రవికుమార్ యాదవ్, శ్రీకాంత్, తరుణ్ యాదవ్, మహేష్, శివకుమార్ పాల్గొన్నారు.