కట్టంగూర్, సెప్టెంబర్ 01 : జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా పంపిణీ చేస్తామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని ఆయన పరిశీలించి, స్టాక్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కూడా అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేసి వాడుకోవాలని సూచించారు. జిల్లాకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 51 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావడంతో రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాకు ఇంకా 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, మంగళవారం మరో 13 వందల టన్నుల యూరియా వస్తుందని చెప్పారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఆధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, సీఈఓ బండ మల్లారెడ్డి, ఏఈఓ నవీన్, సిబ్బంది ఉన్నారు.