పెన్పహాడ్, డిసెంబర్ 01 : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అంతా సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండల పరిధిలోని పెన్పహాడ్, గాజుల మల్కాపురం, చిదేళ్ల గ్రామాల్లో ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద నామినేషన్ల ప్రక్రియ, పోలీసు బందోబస్తును ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ ప్రజలు, ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలని సూచిస్తూ ఎన్నికల నియమావళి పట్ల అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శాంతిభద్రత విషయంలో ఎలాంటి రాజీలేదని, నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తావులేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, తాసీల్దార్ లాలూ నాయక్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ కాస్తాల గోపి కృష్ణ , ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Penpahad : స్థానిక సంస్థల ఎన్నికల సజావుగా సహకరించాలి : ఎస్పీ కె.నరసింహ