కట్టంగూర్, ఫిబ్రవరి 10 : స్థానిక సంసల్థ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో రామన్నపేట బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో కొట్లాడుకునే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ పాలన చేస్తూ ఫార్మా కంపెనీల పేరుతో వేలాది మంది పేద రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు రావడం గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల పెట్టకుండా పూటకోమాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచానికి చాటిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దే అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని తెలిపారు.
అధికార పార్టీ నాయకులు కేసులు పెడితే బయపడవద్దని, అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగు ల నర్సింహ, గాజుల బుచ్చమ్మ, గుండగోని రాము లు, బీరెల్లి ప్రసాద్, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, మంగదుడ్ల వెంకన్న, దాసరి సంజయ్‌కుమార్, తవిడబోయిన భవాని, అంతటి శ్రీనివాస్, నోముల వెంకటేశ్వర్లు, షేక్ జానీపాషా, నకిరేకంటి నర్సింహ, పెద్ది బాలనర్సయ్య. పనస సైదులు, రేకల భిక్షం, బెల్లి సుధాకర్, నలమాద సైదులు, రెడ్డిపల్లి మనోహర్, మునుగోటి ఉత్తరయ్య పాల్గొన్నారు.