రామగిరి : డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థులు యువత బాధ్యతాయుతంగా పనిచేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సూచించారు.
తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ‘ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు’ బస్సు కళాజాత బుధవారం నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ మాట్లాడారు.
బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులు డ్రగ్స్‌ను పారద్రోలడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనేక ప్రజా పోరాటాల్లో విద్యార్థుల పాత్ర, వారి త్యాగాలు మరువలేనివని, చురుకుదనం చలనశీలత కలిగిన యువశక్తి, దేశ ప్రగతికి, సామాజిక మార్పునకు ఉపయోగపడాలన్నారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ సామాజిక రుగ్మతలను రూపుమాపుటలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
తమలోని నైపుణ్యాలను గుర్తించి సాధనతో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం ప్రజా నాట్యమండలి సభ్యులు పల్లె నరసింహ బృందం ఆధ్వర్యంలో గంజాయి మహమ్మారిపై లఘు నాటికను ప్రదర్శించారు. కళాబృందం అనేక సామాజిక సమస్యలను స్పృశిస్తూ పాడిన పాటలు, నృత్యాలు విద్యార్థులను అధ్యాపకులను ఆకర్షించాయి. కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, విద్యార్థి నాయకులు, రెహమాన్, మురళి, జిల్లా యాదయ్య, ఎంజీయూ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మారం వెంకటరమణారెడ్డి, విద్యార్థులు, బోధనా బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.