– అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి
నల్లగొండ రూరల్, జనవరి 26 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు వ్యక్తులు తాము ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేదా ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులమని చెప్పుకుంటూ ఆహార వ్యాపారులను బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాంత్ రెడ్డి, విక్రమ్ నాయుడు, శ్రీనివాస్ నాయక్ అనే పేర్లతో కొందరు వ్యక్తులు జిల్లాలో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం గుర్తించింది. 8074735461, 7386160150, 8886397761 అనే మొబైల్ నంబర్లను ఉపయోగించి వీరు కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మీట్ షాపులు, చికెన్–మటన్ షాపులు, ఫ్రూట్ జ్యూస్ సెంటర్లు, క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హోల్సేల్, రిటైల్ ఫుడ్ గోదాములు వంటి అన్ని రకాల ఆహార వ్యాపార సంస్థలకు ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా వెళ్లి అధికారులమని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి.
మిర్యాలగూడ, నల్లగొండ, హాలియా, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో “షాప్ సీజ్ చేస్తాం”, “లైసెన్స్ రద్దు చేస్తాం”, “కేసులు నమోదు చేస్తాం” అంటూ భయపెట్టే మాటలతో వ్యాపారులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఇటువంటి చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విధంగా ఫోన్ కాల్స్ చేసి హెచ్చరికలు ఇవ్వడం, బెదిరింపు స్వరంలో మాట్లాడడం లేదా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం అధికారిక విధానం కాదన్నారు. అధికారిక తనిఖీలు ఎప్పుడూ చట్టబద్ధమైన ప్రక్రియ ప్రకారమే, ప్రభుత్వ గుర్తింపు కార్డుతో, రాతపూర్వక విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.
అనుమానాస్పద కాల్స్ లేదా వ్యక్తులు ఎదురైతే వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించారు. వెంటనే సమీప ఫుడ్ సేఫ్టీ అధికారి, జిల్లా ఫుడ్ సేఫ్టీ కార్యాలయం లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రత, వ్యాపారుల హక్కుల రక్షణే ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రధాన లక్ష్యమని, నకిలీ వ్యక్తుల మోసాలకు తావు లేకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.