యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2వేల నుం చి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో రూ.2వేల దాకా పంపిణీ చేస్తున్నారు.
మేజర్ పంచాయతీల్లో రూ.5వేల దాకా పంచుతున్నారు. ప్రధానంగా భూదాన్‌పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం, జూలూ రు, ఇంద్రియాల, పిలాయిపల్లి, వంకమామిడి, బీబీనగర్ మండలంలోని కొండమడుగు, బీబీనగర్, గూడూరు, వెంకిర్యాల, భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి, ముత్తిరెడ్డి గూ డెం, బస్వాపూర్, చందుపట్ల, బొల్లేపల్లి, వలిగొండ మండలంలోని టేకుల సోమారం, వలిగొండ, వేములకొండ, అర్రూరు, రెడ్ల రేపాక, సంగెం, రామన్నపేట మండలంలోని సిరిపురం, రామన్నపేట, ఎల్లంకి, బోగారం, నిర్నేముల తదితర గ్రామా ల్లో ఓటర్లకు గిరాకీ పెరిగింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను రప్పిస్తూ అదనంగా రవాణా ఖర్చులు భరిస్తున్నారు. డబ్బుతో పాటు లికర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఇంకొందరు గిఫ్టు రూపంలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రైసు కుకర్లు, చీరలు తదితర కానుకలు పంచారు.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఐదు మండలాల్లో రెండో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిం ది. 150 జీపీలకు 10 సర్పంచ్‌లు, 1332 వార్డులకు 171 ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 140 జీపీలు, 1161 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. సర్పంచ్‌కు 388 మంది అభ్యర్థులు, వార్డులకు 2821మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో 2,02,716 మంది ఓటర్లు ఓటు హకును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,00,801 పురుషులు, 1,01,915 మహిళలు ఉన్నారు. భూదాన్ పోచంపల్లిలో 26,921, భువనగిరిలో 38,306, బీబీ నగర్ లో41,154, రామన్నపేటలో 43,904, వలిగొండలో 52431 మంది ఓటేయనున్నారు.
రెండో విడత పోలింగ్ సందర్భంగా 4337 మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. 1296 ప్రిసైడింగ్ అధికారులు, 1572 ఇతర పోలింగ్ అధికారులు, 145 స్టేజ్ 2 ఆర్వోలు, 28 జోనల్ అధికారులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. మొత్తంగా పోలింగ్‌కు 1296 బ్యాలెట్ బాక్సులు ఉపయోగించనున్నారు. శనివారం మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటల నుంచి ఓట్ల లెకింపు ప్రారంభమై.. ఫలితాలు వచ్చే వరకు లెకిస్తారు. అనంతరం గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిర్యాలగూడ, డిసెంబర్ 13: మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా పది మండలాల్లో 241 సర్పంచ్ స్థానాలకు, 1832వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు శనివారం సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ పర్యవేక్షణలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. సబ్ కలెక్టర్ డివిజన్ పరిధిలో వేములపల్లి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, దామరచర్లలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి పోలింగ్ సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. డివిజన్లోని అడవిదేవులపల్లి మండలంలో 13 సర్పంచ్ స్థానాలు ఉండగా రెండు ఏకగ్రీవం కావడంతో 11 స్థానాలకు, 108 వార్డులకు 17 స్థానాలు ఏకగ్రీవం కాగా 91 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అనుములలో 24 సర్పంచ్ స్థానాలకు 4 ఏకగ్రీవం కాగా 19 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మరొక గ్రామమైన పేరూరులో ప్రజలు నామినేషన్ వేయకపోవడంతో అక్కడ ఎన్నిక నిలిచిపోయింది. అనుములలో 202 వార్డులు ఉండగా 56 ఏకగ్రీవం కాగా 136 స్థానాలకు, దామరచర్లలో 35 సర్పంచ్ స్థానాలు ఉండగా 1 స్థానం ఏకగ్రీవం కాగా 34 స్థానాలకు, 302 వార్డులు ఉండగా 83 ఏకగ్రీవం కాగా 219 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మాడ్గులపల్లిలో 27 సర్పంచ్ స్థానాలు ఉండగా 5 ఏకగ్రీవం కాగా 21 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందుగులలో హైకోర్టు ఉత్వర్వుల మేరకు ఎన్నిక నిలిచిపోగా 228 వార్డులు ఉండగా 43 ఏకగ్రీవం కాగా 177 స్థానాలకు, మిర్యాలగూడలో 46 సర్పంచ్ స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా 44 స్థానాలకు, 394 వార్డులకు 58 ఏకగ్రీవం కాగా 336 స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి.
నిడమనూరులో 28 సర్పంచ్ స్థానాలకు, 256 వార్డులకు 36 ఏకగీవ్రం కాగా 218 స్థానాలకు, పెద్దవూరలో 28 సర్పంచ్ స్థానాలకు 4 ఏకగ్రీవం కాగా 24 స్థానాలకు, 244 వార్డులకు 42 స్థానాలు ఏకగ్రీవం కాగా 202 స్థానాలకు జరగనున్నాయి. త్రిపురారంలో 32 సర్పంచ్ స్థానాలు ఉండగా 8 ఏకగ్రీవం కాగా 24 స్థానాలకు, 270 వార్డులకు 90 ఏకగ్రీవం కావడంతో 180 స్థానాలకు, తిరుమలగిరి(సాగర్)లో 35 సర్పం చ్ స్థానాలు ఉండగా 12 ఏకగ్రీవం కాగా 23 స్థానాలకు, 288 వార్డులకు 126 ఏకగ్రీవం కాగా 159 స్థానాలకు, వేములపల్లిలో 12 సర్పంచ్ స్థానాలకు, 116 వార్డులకు రెండు ఏకగ్రీవం కాగా 114 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ వ్యాప్త్తంగా 281 సర్పంచ్ స్థానాలు, 2408 వార్డులు ఉండగా 38 సర్పంచ్ స్థానాలు, 553 వార్డులు ఏకగ్రీవం కాగా 241 సర్పంచ్ స్థానాలకు, 1832వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.