గట్టుప్పల్, మే 01 : నల్లగొండ జిల్లా యువజన క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో గట్టుప్పల్ మండలం వెల్మకన్నె పాఠశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు గురువారం ప్రారంభించారు. శిక్షణ జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎంపీటీసీ చాపల మారయ్య మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెల్మకన్నె గ్రామ పేరును జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని వ్యాయామ ఉపాధ్యాయుడు పరమేశం, సీనియర్ క్రీడాకారుల ద్వారా ఆటలో మెలకువలు నేర్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రావుల రమేశ్ మాట్లాడుతూ.. శిక్షణ శిబిరాన్ని వెల్మకన్నె గ్రామానికి కేటాయించినందుకు డి.వై.ఎస్.ఓ. కుంభం నర్సిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ.. క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు భీమనపల్లి పవన్, శివమణి, నవీన్, మనోజ్ సాయి, రామకృష్ణ, 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.