నీలగిరి, ఆగస్టు 23 : రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నల్లగొండ జిల్లాలో శాంతియుత వాతావరణం నడుమ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలను శనివారం ఒక ప్రకటనలో కోరారు. నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపల వద్ద గాని, ఊరేగింపులకు గాని డి.జేలు ఏర్పాటు చేయకూడదన్నారు. గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు స్పీకర్లను తక్కువ సౌండ్‌తో రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలన్నారు. మండప నిర్వాహకులు ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విగ్రహాలను రోడ్డుకు ఇరుపక్కల ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని, సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండప నిర్వహుకులు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు చేయుటకు నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm నందు వివరాలు పొందుపరిచి అప్లికేషన్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేయాలన్నారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు వారి చూచనలు పాటిస్తూ సహకరించాలని పేర్కొన్నారు.
* మండపం ఏర్పాటు చేయు స్థలం వారి యాజమానుల అనుమతులు తీసుకోవాలి
* గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి
* షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ఉపయోగించాలి
* గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి
* గణేష్ మండపాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి
* గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో మంచి నాణ్యత గల స్టేజీ, షెడ్డు ఏర్పాటు చేయవలెను
* గణేష్ మండపంలో 24 గంటలు ఇద్దరు వాలంటీర్ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలి
* గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకుని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి
* గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం
* విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం, సూచనలు చేస్తారు.
* ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలి
* మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100 గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి
* సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు, ఎవరికైనా సందేహాలు ఉన్నా సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలి.