రామగిరి, జూన్ 19 : ఇంజినీరింగ్ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ‘టీఎస్ ఈసెట్’ కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 17న ప్రారంభమైన ప్రక్రియలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సెట్-2025లో ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు స్లాట్ బుకింగ్ ప్రకారం హాజరై తమ సర్టిఫికెట్స్ పరిశీలన చేసుకుని కళాశాలల ఎంపికకై వెబ్ ఆప్షన్స్‌కు అర్హత సాధించారు. కాగా తొలి రోజు 122 మంది, రెండో రోజు 192, చివరి రోజు 185 మందితో కలిపి మొత్తం 499 మంది విద్యార్థులు హాజరైనట్లు కౌన్సిలింగ్ కేంద్రం కన్వీనర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల హెచ్వోడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.