దామరచర్ల, సెప్టెంబర్ 28: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని కొత్తపేట తండాకు చెందిన సాయిసిద్ధును కులం పేరుతో తిట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరపాలని ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు. మిర్యాలగూడలో యూరియా కోసం ధర్నా చేసిన కారణంగా ఈ నెల 9న ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి కొత్తపేట తండాకు చెందిన సాయిసిద్ధును విచారణ కోసం పిలిచి కులం పేరుతో తిట్టడమే కాకుండా కొట్టారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఈ నెల 15న ఫిర్యాదు చేశారు.
ఆదివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సాయిసిద్ధు ఇంటికి వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటనపై సాయిసిద్ధుతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులు, ఎరువుల కోసం ఆందోళన చేస్తావా..? అని పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ, పోలీసులు కులం పేరుతో తిట్టి, ఇష్టానుసారంగా కొట్టిన విషయాలను సాయిసిద్ధు చైర్మన్‌కు వివరించారు. వెంటనే చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రంగా స్పందించారు.
‘నీవు అధైర్యపడొద్దు. నీకు ఎస్టీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది. చట్టపరంగా అన్ని రకాలుగా న్యాయం చేస్తాం’ అని భరోసా ఇచ్చారు. అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య విలేకర్లతో మాట్లాడుతూ మండలానికి చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధును వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి, పోలీసులు అకారణంగా థర్డ్‌డిగ్రీ ప్రయోగించి కొట్టడం, కుటుంబంపై తీవ్ర పదజాలంతో తిట్టడం దారుణమన్నారు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే.. చేనే కంచె మేసినట్లుగా ఉందన్నారు.‘ తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉంది. పోలీసులకు కొట్టే అధికారం లేదు. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలి.
ప్రజలను గౌరవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పినా ఇలాంటి సంఘటన జరగడం విచారకరం’ అని అన్నారు. గిరిజన యువకుడిని కొట్టడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అడ్డువచ్చిన గర్భిణిని తిట్టడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదిస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్షణ్‌తో ఫోన్లో మాట్లాడి వివరించారు. ‘బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వైద్య ఖర్చులు భరించాలి. నష్టపరిహారం ఇవ్వాలి.
సాయిసిద్ధుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి’ అని సీఎంతో మాట్లాడతామన్నారు. భవిష్యత్లోఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాథోడ్ రాంబాబు, జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి చత్రూనాయక్, డీఎస్సీ రాజశేఖర్‌రాజు, తహసీల్దార్ జవహర్లాల్ తదితరులున్నారు.