గరిడేపల్లి, సెప్టెంబర్ 9 : గరిడేపల్లిలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ప్రతీ సీజన్‌కి 5వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 3వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని గ్రోమోర్ ఫెర్టిలైజర్ దుకాణానికి 600 బస్తాల యూరియా రావడంతో రైతులు ఆధార్ కార్డులు తీసుకొని గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున మాత్రమే ఇచ్చామని మండల వ్యవసాయాధికారి ప్రీతం కుమార్ తెలిపారు. కాగా తాము నాట్లు వేసి 20 రోజులవుతోందని, యూరియా అందకపోవడంతో పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీరని యూరియా వెతలు
మోతె, సెప్టెంబర్ 9 : రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. మోతెలోని మన గ్రోమోర్, మామిళ్లగూడెంలో ఉన్న సొసైటీ వద్ద యూరియా కోసం మంగళవారం రైతులు బారులు తీరారు. వరినాట్లు వేసి నెల రోజులు దాటినా యూరియా అందకపోవడంతో రైతులు ఉదయం లేవగానే సొసైటీలు, ఎరువుల షాపుల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం రాత్రి 11 గంటల నుంచే బారులు తీరారు. కొంతమంది రైతులకే యూరియా కట్టలు అందాయి. మిగతావారికి అందకపోవడంతో, గ్రోమోర్ సొసైటీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఒక్కొక్క రైతుకు ఒక్క కట్ట చొప్పున యూరియా ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఎక్కడుందో తెలుసుకొని సొసైటీల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
యూరియా పై ఆరా..
మిర్యాలగూడ, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూరియా సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం వారు మండలంలోని యాద్గార్‌పల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు గంటల తరబడి క్యూలో నిలబడితే ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు అప్పనబోయిన వెంకటయ్య, వస్కుల రవి, రామకృష్ణ, పురుషోత్తం, రాములు, ఆంజనేయులు, ప్రశాంత్, శేఖర్, నర్సయ్య, వెంకన్న, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.