నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మొంథా తుఫాన్ ధాటికి నల్లగొండ జిల్లా చిగురుటాకులా వణికింది. మంగళవారం సాయంత్రం నుంచి ముసురుతో మొదలై..మోస్తరుగా…భారీ వర్షంగా..బుధవారమంతా ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉం ది. దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించింది. అర్ధరాత్రి దేవరకొండ రెవెన్యూ డివిజన్లో కురిసిన కుండపోత వర్షం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తెల్లవారి చూసే సరికి కాలనీల్లోకి నీళ్లతోపాటు ఊర్ల చుట్టూ ఉన్న వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
రోడ్లపై నుంచి వాగులు ఉగ్రరూపం దాల్చడంతో చాలా గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దేవరకొండ మం డలంలోని కొమ్మేపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టడంతో విద్యార్థులు, సిబ్బంది అహాకారాలు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ రంగంలోకి దిగి విద్యార్థులను, ఉపాధ్యాయులను తాడు సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మైనంపల్లి వాగు ఉధృతిలో చిక్కుకున్న నిండు గర్భిణీని చింతపల్లి 108 సిబ్బంది స్ట్రెచ్చర్తో వాగు దాటించి దవాఖానకు తరలించాల్సి వచ్చింది.
చేతికి అందాల్సిన దశలో వరి చేలతోపాటు ఐకేపీ కేం ద్రాల్లోని ధాన్యం రాశులు భారీ వర్షానికి తడిసిముద్దయ్యాయి. కొన్నిచోట్ల వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడు పత్తి రైతు నిండా ముగినినట్లే. ఈ సీజన్లో కురుస్తున్న అతివృష్టితో ఇప్పటికే చేలు దెబ్బతినగా అంతంతమాత్రంగానైనా దిగుబడి వస్తుందని ఆశిస్తున్న తరుణంలో తుఫాన్ నిండి ముంచింది. చేలపై ఉన్న పత్తి వర్షానికి తడిసి రంగుమారగా, ఇండ్లల్లోని పత్తి వర్షానికి తేమతో రంగు మారనుంది. దీంతో ఈ సీజన్లో రైతుల కోలుకునే పరిస్థితి కనిపిస్త లేదు.

పొంగిపొర్లతున్న వాగులు
రోజంతా కురిసిన వర్షాలకు జిల్లాలోని ప్రధానమైన వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండమల్లేపల్లి మండలంలోని గౌరికుంట తండాలో వరద నీటితో 20 ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కొండమల్లేపల్లిలో నల్లగొండకు వచ్చే ప్రధాన రహదారి జలమయంగా మారడంతో వాహనాలు నెమ్మదించాయి. దేవరకొండ-డిండి రహదారిపై గొనకల్ వద్ద వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకొండ మండలం తాటికోల్ బ్రిడ్జిపై నుంచి వరద నీటితో రాకపోకలు ఆగిపోయాయి. మైనంపల్లి వాగు ఉధృతితోనూ అంతరాయం కలిగింది.
గుడిపల్లి మండలం పోల్కంపల్లిలో వాగు ఉధృతికి ప్రజలను పోలీసుల అప్రమత్తం చేశారు. చండూరు మండలంలో శశిలేటు వాగు ఉధృతితో చామలపల్లితో పాటు గ్రామాలకు రాకపోకలకు అంతరా యం కలిగింది. తిర్మలగిరిసాగర్ మండలంలో వాగులు ఉధృతికి మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. పెద్దవూర మండలం భట్టుగూడెం వద్ద బ్రిడ్జ్జిపై నుంచి వాగు ఉధృతి కొనసాగింది. గుర్రంపోడు మండలం మోసంగి చెర్వు అలుగునీటితో గుర్రంపోడు- పెద్దవూర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. త్రిపురారం మం డ లం తుంగపాడు వాగు రాగడప వద్ద పొంటపొలాలను ముంచెత్తింది. శాలిగౌరారం మం డలం ఊట్కూర్‌కు వెళ్లే రహదారిని వరదనీరు ముంచెత్తింది. కనగల్ కత్వా ఉధృతంగా ప్రవహిస్తుంది.
సాగర్, మూసీకి భారీ వరద
సాగర్ క్రస్టుగేట్లను మరోసారి ఎత్తారు. సాయంత్రం ఏడు గంటలకు సాగర్‌కు 3.97లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటిమట్టం కూడా 589.60 అడుగులు చేరడంతో నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీకి సైతం భారీగా వరద వస్తుండడంతో 8గేట్లను ఎత్తివేశారు. ఇప్పటికే డిండి కొన్ని రోజులుగా అలుగు పోస్తూనే ఉంది.
చందంపేటలో రికార్డు స్థాయిలో
దేవరకొండ డివిజన్లోని అన్ని మండలాల్లో అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 8.30 గంటలలోపు భారీ వర్షం నమోదైంది. చందంపేట మండలంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 14.01సెం.మీ. వర్షపాతం నమోదైంది. తర్వాత నేరడుగొమ్ములో 13.3సెం.మీ., పీ.ఏ.పల్లిలో 12.4సెం.మీ., కొండమల్లేపల్లిలో 11.8సెం.మీ., డిండిలో 11.3సెం.మీ., దేవరకొండలో 10.9సె.మీ., గుడిపల్లిలో 10.3సెం.మీ., పెద్దవూరలో 9.5సెం.మీ., ఘట్టుప్పల్‌లో 8.9సెం.మీ., మర్రిగూడలో 8.2సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇలా జిల్లాలోని 33 మండలాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతంగా 5.9సెం.మీటర్లు కావడం గమనార్హం. ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఈ నెల 29వ తేదీ వరకు 596.2మీ.మీటర్ల సాధారణ వర్షపాతానికి గానూ 44శాతం అధికంగా అంటే 856.5 మీ.మీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. బుధవారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పరిశీలిస్తే మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శాలిగౌరారంలో 11.7సెం.మీ., నకిరేకిల్లో 5.2సెం.మీ., కేతేపల్లిలో 5, కట్టంగూర్‌లో 4.7, చండూరులో 4.2, చిట్యాలలో 3.7, నార్కట్‌పల్లిలో 3.4, మునుగోడులో 3.2, నాంపల్లిలో 2.6, కనగల్‌లో 2.6, తిప్పర్తిలో 2.4, చింతపల్లిలో 2.3, నల్లగొండలో 2.2, గుర్రంపోడులో 1.6 సెం.మీ. వర్షం కురిసింది. ఇక మిగతా మండలాల్లోనూ వర్షప్రభావం నెలకొంది.
తడిసి ముద్దయిన ధాన్యం
భారీ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తుఫాన్ ప్రభావంతో రైతులు ధాన్యం రాశులను పట్టాలతో కప్పి ఉంచినా, వర్షంతో ధాన్యం తడిసిపోయింది. చాలా చోట్ల ధాన్యం నేలపైనే ఉండడంతో కింది నుంచి వచ్చిన వరద వల్ల ధాన్యం తడిసింది. వరద ఉధృతికి కొన్నిచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. కొన్ని కేంద్రాల్లో ధాన్యం తెచ్చి 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా సకాలంలో కొనుగోళ్లు జరపకపోవడంతో పూర్తిగా ఆరిన ధాన్యం సైతం ప్రస్తుతం వర్షాలతో మళ్లీ అధిక తేమకు గురైంది.
ఈ ధాన్యాన్ని తిరిగి ఆరబెడితే తప్పా కొనే పరిస్థితి లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం కేంద్రాలను పరిశీలించినా అప్పటికే ధాన్యం తడిసిపోవడంతో వెంటనే కొనే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇక పత్తి పంట దాదాపుగా తుఫాన్ దెబ్బకు తూడ్చుకుపెట్టుకుపోయినట్లేనని రైతులు వాపోతున్నారు. చేల మీద ఉన్న పత్తి వర్షానికి నల్లబారి బూజు పడుతుందని, ఇప్పటికే తెంపి అమ్మకానికి సిద్ధం చేసుకున్న పత్తి తేమతో రంగుమారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో పత్తి కొనుగోళ్లు గాడిలో పడలేదు. దీంతో పత్తి రైతులు వర్షాలకు మరింత నష్టపోయే పరిస్థితులు దాపురించాయి.