రామగిరి (నల్లగొండ), మే 19 : అసంఘటిత రంగ కార్మికులకు అనేక న్యాయ చట్టాలు ఉన్నాయని, వాటిని పటిష్టంగా అమలు పరచడంలో కార్మిక శాఖ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పి. పురుషోత్తమరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థలో సోమవారం అసంఘటిత రంగ కార్మికులకు నిర్వహించిన న్యాయ చట్టాల అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు సరియైన పరిస్థితులు కల్పించాలని, వారి భద్రత, వేతనాలు ఇతర మౌలిక వసతులు అందించాలని తెలిపారు.
కార్మికులకు ఇబ్బంది కలిగిస్తే యజమాన్యాలపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా హక్కులను కాపాడుకోవాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా లేబర్ అధికారి రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నిమ్మల భీమారెడ్డి, కార్మికులు, ఆచారి రవి, మదర్ లెనిన్ పాల్గొన్నారు.