మునుగోడు, సెప్టెంబర్ 10 : కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రక్షణకై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం మునుగోడు మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంభిస్తూ, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు.
నిర్మాణరంగ కార్మికులు తమ రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడమే తప్పా మరో మార్గం లేదన్నారు. నల్లగొండ పట్టణంలో ఈ నెల 20వ తేదీన జరిగే 10వ జిల్లా మహాసభ, ఈ నెల 24, 25వ తేదీల్లో భద్రాచలంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల నూతన కమిటీని 23 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, జీడిమెట్ల సైదులు, పగడాల సైదులు, కాసర్ల రవీందర్, కిట్టయ్య, జీడిమడల లింగస్వామి, చంద్రస్వామి, శంకర్ పాల్గొన్నారు.