మునుగోడు, మే 20 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలతో మోదీ మెడలు వంచుతామని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండ శ్రీశైలం, సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు.
రైతాంగం, కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఆపకపోతే జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె మోదీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం అవుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరత్ కుమార్, రైతు సంఘం మండల కార్యదర్శి వేముల లింగస్వామి, గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ మండల అధ్యక్షుడు లింగయ్య, వేముల విజయ్, ఎర్ర అరుణ, పెరమండ్ల రాజు, నూకల పెద్దమ్మ, దుర్గయ్య, పావని, సరిత, సంపూర్ణ, మంగమ్మ, రమేశ్ పాల్గొన్నారు.