నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్ల పద్ధతిపై క్షేత్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఏ రాజకీయ పార్టీ నేత లేదా కార్యకర్తను కలిసినా రిజర్వేషన్ల కేటాయింపుపైనే చర్చించుకుంటున్నారు. చాలా చోట్ల అనూహ్యంగా రిజర్వేషన్లు రావడంతో ఇన్నాళ్లుగా ఎన్నో ఆశలు పెట్టుకున్న హేమాహేమీలు సైతం ఖంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం ఈసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వా ర్డు సభ్యుల స్థానాలకు ప్రకటించిన రిజర్వేషన్లల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నా యి. కొన్నిచోట్ల ఒకటీ రెండు కుటుంబాలు మాత్రమే ఉన్న సామాజిక వర్గాలకు ఆయా స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల ఆ సామాజిక వర్గం ఓటర్లు అసల్లేకపోయినా వారికే రిజర్వు అయినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అసలు రిజర్వేషన్ల ప్రకటనకు అనుసరించిన విధానం ఏంటన్న చర్చ సర్వత్రా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. సోమవా రం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో మొదలై ఆ వెంటనే గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికలు నిర్వహిస్తారు. అంతకు ముందే ప్రభుత్వం ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. అయితే గత ఎన్నికల సమయంలో కేసీఆర్ సర్కార్ ప్రకటించిన రిజర్వేషన్లు వరుసగా రెండు దఫాలు అవే ఉంటాయని అసెంబ్లీలో చట్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర కు స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని జీవో జా రీ చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారమే ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో చాలాచోట్ల అనూహ్యం గా రిజర్వేషన్లు మారాయి.
గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల ప్రకటనలో చాలా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చో ట్ల ఆయా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోయినా వారికే రిజర్వు అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల గ్రామంలో ఉన్న ఒకటి, రెండు కుటుంబాలకు చెం దిన సామాజిక వర్గానికి రిజ ర్వు అయినట్లు సమాచారం. దీంతో అక్కడ ఒకటీ రెండు కుటుంబాల్లోని వారే ప్రత్యర్థులుగా తలపడాల్సిన పరిస్థితి. దామరచర్ల మండలంలో దాదాపు గిరిజనులే ఉన్న తండా లు సైతం బీసీలకు రిజర్వు అయినట్ల తెలిసింది. అక్కడ బీసీ ఓటర్లు లేరని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక నేతలు చెప్తున్న ప్రకారం జేత్రం తండా, బండావత్ తండా, గోన్యా తండా, బాలాజీనగర్ తండా, తూర్పు తండాల్లో బీసీ జనాభా లేనప్పటికి అక్కడ బీసీ రిజర్వు స్థానాలుగా ప్రకటించారు. అధికారుల లెక్కల ప్రకారం 100శాతం ఎస్టీ జనాభాలో ఈ తండాలు లేవ ని తెలిసింది. దీంతో ఇక్కడ అనూహ్యంగా బీసీలకు రిజర్వు అయ్యాయి. దేవరకొండ మండలంలోని మైనంపల్లి దుబ్బతండా పంచాయతీల్లో బీసీ కుటుంబం ఒక్కటే ఉం డగా అక్కడ బీసీలకు రిజర్వు అయ్యింది. దీం తో ఆ కుటుంబం నుంచే సర్పంచ్ ఎన్నిక కావాల్సిందే. త్రిపురారం మండలం పలుగుతండా, లచ్చతండా, రూప్లా తండా, సత్యంపాడు తండాలు బీసీకి రిజర్వు కావడంతో అక్కడ గిరిజనులే ఇదేంటంటూ ఆశ్చర్యపోతున్నారు. మాడ్గులపల్లి మండలం ఇందుగులలో రెండే ఎస్టీ కుటుంబాలు ఉంటే అక్కడ వారికి ఎస్టీ సర్పంచ్‌తో పాటు పలు వార్డులు రిజర్వు అయినట్లు తెలిసింది. తిరుమలగిరి సాగర్ మండలంలోని చింతలపాలెం పంచాయతీ ఎస్టీకి రిజర్వు కాగా అక్కడ ఎస్టీ జనాభా లేదని సమాచారం. సంస్థాన్ నారాయణపురం మం డలంలో ఎంపీపీ స్థానం జనరల్‌కు రిజర్వు కాగా 13 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్క స్థానమే జనరల్‌కు రిజర్వు అయింది. అది కూడా పూర్తిగా ఎస్టీ ఓటర్లు ఉన్న పొర్లగడ్డ తండా కావడం గమనార్హం. దీంతో జనరల్ అభ్యర్థులు ఇక్కడ పోటీకి సుముఖత చూపే పరిస్థితి లేదు. ఇక అడవిదేవులపల్లి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా అక్కడ ఒకటి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కాలేదని అక్కడి ఎస్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి ఎస్సీలకు ఒక్క స్థానమైన కేటాయించాలంటూ వినతిపత్రం సమర్పించారు. వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లలో ఎన్నో వింతలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతాయా? లేదా అనేది తేలాల్సి ఉంది.
నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ(మహిళ)కు రిజర్వు అయ్యింది. అయితే జిల్లాలోని మొత్తం 33 జడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీ జనాభా ప్రకారం ఐదు స్థానాలకు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించారు. అందులో ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే నాలుగు స్థానాలు ఉండడం గమనార్హం. పెద్దవూర, డిండి జడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఎస్టీ మహిళకు కాగా దేవరకొండ, పీఏపల్లి, కొండమల్లేపల్లి జడ్పీటీసీ స్థానాలు ఎస్టీ జనరల్‌గా రిజర్వు అయ్యాయి. దాదాపు ఇక్కడి నుంచి ఎన్నికైన ఎస్టీ మహిళకు మాత్రమే జడ్పీ చైర్మన్ పీఠం దక్కుతుంది. వీరు కాకుండా ఎక్కడైనా జనరల్‌కు రిజర్వు అయిన స్థానాల నుంచి ఎస్టీ మహిళ జడ్పీటీసీగా ఎంపికైతే జడ్పీ చైర్మన్ రేసులో ఉండొచ్చు. కానీ అలాంటి సందర్భాలు చాలా తక్కువే. ఇక ఇదే సమయంలో ఒక మండలంలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి రిజర్వు అయ్యాయి. కాకపోతే ఒకే సామాజిక వర్గానికి చెందిన జనరల్ లేదా మహిళకు రిజర్వు అయ్యాయి. రెండింటికి వేర్వేరుగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టినప్పుడు ఆయా మండలాల్లోని జనాభా మేరకు రెండింటికి దాదాపు ఒకే విధమైన రిజర్వేషన్ వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
బొమ్మలరామారం,సెప్టెంబర్ 30: యాదా ద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ప్రకటించడం తో గందరగోళం నెలకొంది. ఐదేండ్లుగా వివి ధ పార్టీలను నమ్ముకున్న ఆశావాహుల ఆశ లు గల్లంతయ్యాయి. ప్రధానంగా జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఎస్టీలకు రిజర్వు కావడం తో బీసీ,జనరల్ అభ్యర్థులు తమకు గుర్తింపే లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. బీసీ, జనరల్ వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్న మర్యాల, నాగినేనిపల్లి,రాంలింగంపల్లి ఎంపీటీసీ స్థానాలు ఎస్టీ, ఎస్సీలకు రిజర్వుకావడంతో వారి రాజకీయ ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చకపోవడంతో ఆం దోళనలకు గురవుతున్నారు. గోవింద్తం డా లో ఎస్టీ జనాభా ఉండగా ఎంపీటీసీ స్థానం మాత్రం జనరల్‌కు కేటాయించడంపై ప్రజ లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలు మండలంలో 11 ఉండగా ఓసీలకు ఒక్క జనరల్ సీటు కూడా కేటాయించకుం డా వందశాతం ఎస్టీ జనాభా ఉన్న గోవింద్ తండాను జనరల్ సీటుగా మార్చడం వల ్ల ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మండలంలో 35 గ్రామపంచాయతీలు ఉండగా ఎస్టీలకు 11, బీసీలకు 12, జనరల్ 7, ఎస్సీలకు 5 స్థానాలు రిజ ర్వు చేశారు. వాలుతండాలో పూర్తిగా ఎస్టీ జనాభా ఉన్నా జనరల్ రిజర్వేషన్ కేటాయించారు. మర్యాల మేజర్ పంచాయతీలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుకావడంతో నేతల నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. రిజర్వేషన్లు సవరించాలంటూ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.