తుంగతుర్తి, ఏప్రిల్ 7 : తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం నిరుద్యోగ యువకులు ఉపాధి హామీ పని చేస్తూ కనిపించారు. వేసవి సెలవులు కావడంతో గ్రామాలకు వచ్చిన యువకులు ఉపాధి హామీ పథకంలో కూలీలు కార్డులు పొందారు. ఇందులో బీటెక్, పీజీ, బీఈడీ డిగ్రీలు పూర్తి చేసిన వారు సైతం ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండలేక ఉపాధి పనులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఉపాధి మార్గాలు చూపడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని కోరారు. యూత్ డిక్లరేషన్లో భాగంగా ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో నిరుద్యోగులు బొంకూరి మల్లేశ్, బొజ్జ సాయికిరణ్, మల్లెపాక ప్రదీప్, కొండగడుపు వెంకటేశ్, పోలేపాక రాజేశ్, బొంకురి మధు, చింతకుంట్ల సురేశ్, భాను, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.