చివ్వేంల, మార్చి 18 : సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా రెండో రోజు ఆరుట్ల రవికుమారచార్యులు, కృష్ణమాచార్యులచే స్వస్తి వాచనం, విన్నపాలు, బాలబోగం, తీర్ధ గోష్ఠి, నిత్యహోమం, సుదర్శన నారసింహ హోమం, స్వామి వారి కల్యాణంను కన్నుల పండుగగా నిర్వహించారు.
రెండో రోజు భక్తులు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, గుంటూరు, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్ధం త్రాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చకిలం కృష్ణకుమార్, ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ ఆదుర్తి రామయ్య, బంధకవి కృష్ణమోహన్, మురళీ కృష్ణ, యలగబోయిన శ్రీ రాములు, కైరోజు శంకరాచారి కలకోటి నర్సయ్య గుండా శ్రీనివాస్, బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.