చివ్వెంల, మే 09 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో కొలువైన ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చకిలం కృష్ణకుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదూర్తి రామయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవస్థానంలో ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ, ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. మే 10, 2025 సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట పట్టణంలోని సంతోషిమాత దేవస్థానం నుంచి నగర సంకీర్తనలు ప్రారంభమవుతాయని తెలిపారు.
మే 11, 2025 నరసింహస్వామి జయంతి సందర్భంగా ఉండ్రుగొండ ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు, సాయంత్రం 5:00 గంటలకు స్తంభోద్భవ స్తోత్ర పారాయణం, రాత్రి 8:00 గంటలకు వెన్నెల కాంతిలో కల్యాణోత్సవం, మే 12, 2025 (సోమవారం – వైశాఖ పూర్ణిమ) ఉదయం 10 గంటలకు శ్రీ సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమంను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బంధకవి కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం రవిచంద్ర, ఉపాధ్యక్షులు రాచర్ల కమలాకర్, చల్లా లక్ష్మీకాంత్, సభ్యులు చకిలం వెంకటేశ్వర్లు, గుండా శ్రీనివాస్, నూక వెంకటేశం గుప్తా, గోపారపు రాజు, దేవరశెట్టి సోమయ్య, పబ్బ ప్రకాశ్, అబ్బురి వినోద్ పాల్గొన్నారు.