రామగిరి, నవంబర్ 17 : బాల గేయాలు విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆలోచనలను, ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉపకరిస్తాయని ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రచయిత బుచ్చిరెడ్డి రాసిన “ఊగుతున్న ఉయ్యాల” పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బుచ్చిరెడ్డి గేయాలు బాలల హృదయానుభూతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని కొనియాడారు.
ప్రముఖ గాయకుడు అంబటి వెంకన్న మాట్లాడుతూ.. బాల సాహిత్యంలో కృషి చేస్తున్న బుచ్చిరెడ్డి బాల గేయాలు రాయడం అభినందనీయమన్నారు. భాష పట్ల ప్రేమ కలిగే విధంగా ఇవి విద్యార్థులకు ఎంతగానో దోహద పడతాయని తెలిపారు. అనంతరం అంబటి వెంకన్న పాటలు పాడి అందరినీ మంత్రముగ్ధులు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, పున్న అంజయ్య, ఎలికట్టె శంకర్ రావు, రాష్ట్ర గ్రంథాలయ సంఘం కార్యదర్శి వేణుగోపాల్ చార్యులు, రాజేశం, శ్రీను, మల్లేశం, కోమటిరెడ్డి అరుణ, సత్యనారాయణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.