చిట్యాల, జూన్ 28 : చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారును మండలంలోని గుండ్రాంపల్లి సమీపంలో వెనుకగా వస్తున్న ఇన్నోవా ఢీ కొట్టింది దీంతో ముందుగా వెళ్తున్న కారు టైరు పేలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతల పడింది. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో కారును డ్రైవర్ అదుపు చేయలేక ప్రమాదానికి గురైన కారును ఢీకొట్టాడు. అదే మార్గంలో వెనుకగా వస్తున్న మరో కారు ఈ కారును ఢీ కొట్టింది.
ఈ సంటనలో ముందు కారులో ఉన్న నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన దేప సరిత(46), కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి(50)లకు తీవ్ర గాయాలు కాగా మూడు కార్లలో ప్రయాణిస్తున్న మరో 8 మందికి గాయాలయ్యాయి. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సరిత, దేవేందర్‌రెడ్డి మృతి చెందారు. స్థానికులు బాధితులను కార్లలో నుంచి బయటకు తీసేందుకు సాయం చేశారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై కార్లు అడ్డంగా పడిపోవటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.