నల్లగొండ సిటీ, ఏప్రిల్ 10 : రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న రెండు వేర్వేరు ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ దుర్గటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం బాబాసాయిగూడెం స్టేజీ సమీపంలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కనగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సింగం కొండల్కు చెందిన ట్రాక్టర్ వరి ధాన్యం తీసుకుపోతుండగా పంక్చర్ కావడంతో బాబాసాయిగూడెం సమీపంలో రోడ్డుపై నిలిపి వెళ్లాడు.
గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన బలుగూరి శేఖర్ (43) మిర్యాలగూడలోని చెన్నై షాపింగ్ మాల్ లో పనిచేస్తూ రాత్రి 11 గంటల సమయంలో తన సొంత గ్రామానికి బైక్ పై వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న ట్రాక్టర్ ట్రక్కు కనిపించకపోవడంతో దాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనం ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శేఖర్ మృతిచెందాడు. అదే రాత్రి అనుముల మండలం బొట్టువారిగూడెం గ్రామానికి చెందిన చింతకాయల కిరణ్ (32) హాలియా నుంచి నల్లగొండకు వస్తున్న క్రమంలో అదే ట్రాలీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులిద్దరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు.