తుంగతుర్తి, జనవరి 28 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ఆరోగ్య ఉప కేంద్రం అద్దె గత రెండు సంవత్సరాల నుండి కట్టకపోవడంతో సబ్ సెంటర్కు ఇంటి యజమాని తాళం వేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సబ్ సెంటర్ ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ.. కాలనీలో సబ్ సెంటర్ ప్రారంభించినప్పుడు సంబంధిత స్థానిక డాక్టర్లు అద్దె చెల్లిద్దామని చెప్పారని, నెలకు రూ.2 వేల కిరాయి చొప్పున రెండు సంవత్సరాలు రూ.48 వేలు చెల్లించాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి అద్దె ఇవ్వకపోవడంతో సంబంధిత యజమాని గడిచిన వారం రోజులుగా తాళం వేసినట్లు తెలిపారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి సైతం గడిచిన 8 నెలలుగా పూర్తిస్థాయిలో జీతభత్యాలు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.