నీలగిరి, జనవరి 12 : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను చేసి కడుపులోంచి కిలోన్నర కణితిని విజయవంతంగా తొలగించారు. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ కడుపులో విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఈ నెల 5న ఆస్పత్రికి వచ్చింది. అమెను పరీక్షించిన వైద్యులు కడుపులో పెద్ద గడ్డ ఉన్నట్లుగా గుర్తించారు. సోమవారం ఉదయం గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స (హిస్టరెక్టమీ) నిర్వహించారు. సుమారు ఒకటిన్నర కిలోల బరువు గల కణితిని తొలగించారు. శస్త్రచికిత్స సమయంలో పేషెంట్ కు 2 బాటిల్స్ రక్త మార్పిడి చేశారు. మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సను ప్రొఫెసర్ డా.స్వరూప రాణి ఆధ్వర్యంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీకాంత్ వర్మ, డాక్టర్లు విద్యా భార్గవి, లావణ్య, నిఖిత, ప్రఖ్య, అనస్థీషియా డాక్టర్లు నేహా, శ్వేత సిబ్బంది సుధా, పద్మ, రఘు పాల్గొన్నారు.