రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ సజావుగా జరిగింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో మూడు విడుతల్లో పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో 31,725 మంది అభ్యర్థులకు 27,495 (86.7శాతం)మంది హాజరయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మూడు సెంటర్లలో 1,306 మందికి 1,193మంది హాజరయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఎడ్‌సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి ఎంజీయూలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం నల్లగొండలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
రామగిరి, మే 18: బీఈడీ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గురువారం ఆన్లైన్లో నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొదటగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని ఆర్ట్స్బ్లాక్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్. గోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఎంజీయూలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం టీఎస్ ఎడ్‌సెట్ ప్రశ్నపత్రాల కోడ్లను విడుదల చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, మూడో విడుతగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూల్లో జరిగిన పరీక్షకు 31,725 మంది అభ్యర్థులకు గానూ 27,495 మంది హాజరయ్యారు. 4,232 మంది గైర్హా జరైనట్లు, 86.7 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలోని డెసిబెల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్ష కేంద్రాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, ఎడ్‌సెట్ చైర్మన్ సీహెచ్. గోపాల్‌రెడ్డి, కో కన్వీనర్ ప్రొఫెసర్ శంకర్, ఎంజీయూ రిజిస్ట్రార్ టి.కృష్ణారావు, ఓఎస్డీ అల్వాల రవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించారన్నారు. సాంకేతికతను ఉపయోగించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా సమర్థవంతంగా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ విధానం ద్వారా ప్రతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించే అవకాశం సైతం ఉందన్నారు. ఎంజీయూవీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎడ్‌సెట్ నిర్వహణను సవాలుగా స్వీకరించి ఎటువంటి పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వారి వెంట ఎడ్‌సెట్ ప్రత్యేక పరిశీలకుడు బొడ్డుపల్లి రామకృష్ణ, చీఫ్ సూపరింటెండెంట్ వి.రఘవేంద్ర, ఎంజీయూ ప్రొగ్రామర్స్ శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్.వెంకటాచారి, స్టూడెంట్ వెల్పేర్ ఆఫీసర్ ఎల్.మధు, అధికారులు గంపల మధుకర్, ప్రసాద్, మహ్మద్ ఇబ్రహీం ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 1193 మంది హాజరు
టీఎస్ఎడ్సెట్ నిర్వహణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1306మంది అభ్యర్థులకుగాను 1193మంది హాజరుకాగా 113మంది గైర్హాజరయ్యారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాలలో మూడు విడుతల్లో 556 మందికి గాను 525 మంది హాజరుకాగా 31మంది గైర్హాజరైన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో 480 మందికి 438 మంది హాజరుకాగా 42 మంది గైర్హాజరయ్యారు. సనా ఇంజినీరింగ్ కళాశాలలో 270 మందికిగాను 230 మంది హాజరయ్యారు.