సూర్యాపేట, జూలై 25 : బీఆర్ఎస్వీలో టీఆర్‌వీఎస్‌పీ విలీనం కానున్న నేపథ్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ నేతృత్వంలో 800ల మంది విద్యార్థులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రజా పోరాటానికి ఆకర్షితులమై తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్‌ను బీఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించుకోవడం హర్షణీయమన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. టీఆర్‌వీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ మాట్లాడుతూ గత ఏడేళ్లుగా స్వతంత్రంగా విద్యార్థుల సమస్యలే ఎజెండాగా పోరాటం చేశామని, ఇకపై కూడా విద్యార్థి సమస్యలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి గ్రంథాలయాన్ని సందర్శించిన ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్గూరి రాంబాబుగౌడ్, దేశగాని శ్రీనివాస్‌గౌడ్, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, మన్నె మధునాయుడు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.