చిట్యాల, మే 30 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో మరో బస్సు దగ్ధమైంది. బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైనా బస్సులోని 36 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెయిన్బో ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో ఏపీలోని కాకినాడకు బయల్దేరింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోకి బస్సు చేరుకోగానే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే క్లీనర్‌ను అప్రమత్తం చేయటంతోపాటు రోడ్డు పక్కనే బస్సును నిలిపి, ప్రయాణికులను వెంటనే కిందకు దింపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తున్నది. ట్రావెల్స్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.