దామరచర్ల, జూలై 17 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లా స్థాయి మొదలుకుని గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది పారదర్శకత పాటించాలని, ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఎంపీడీఓ, తాసీల్దార్, మండల ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు.
ఇండ్లు నిర్మించుకున్న వారికి నిబంధనల మేరకు వివిధ స్థాయిల్లో చెల్లింపులు చేయాలని, ఇళ్ల నిర్మాణంలో విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వవద్దని చెప్పారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. నిబంధనలకు లోబడి ఇల్లు నిర్మించుకున్న వారికి మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. ఈ విషయంలో లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి, డీసీఓ పత్యా నాయక్, తాసీల్దార్ జావహర్లాల్ పాల్గొన్నారు.