జిల్లాలోని ఒక మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెండో వివాహం చేసుకొని తన రెండో సంతానానికి వ్యాధి ఉన్నదని చెప్పి ప్రిపరెన్షియల్లో పెట్టడం జరిగింది. దీనిని గుర్తించిన అధికారులు సదరు ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా.. నాకు వద్దని రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. కానీ పాయింట్ల కోసం తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అఫిడవిట్ ద్వారా పెద్ద మనుషుల తీర్మానాలు చూపించి పాయింట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాడు.
మరో ఉపాధ్యాయుడు తన కూతురికి వివాహం చేసి ఇప్పుడు ఆమె తన పైనే ఆధారపడుతుందని, డిపెండెంట్ అని చెప్పి పాయింట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇతని వ్యవహారాన్ని సైతం గుర్తించిన అధికారులు ఆయనను ఆ నుంచి తొలగించారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నట్లు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, జూన్ 20 : ‘ఐపీఎస్, ఐఏఎస్‌లను బదిలీ చేయడం ఈజీ కానీ, ఉపాధ్యాయులను బదిలీ చేయడమే చాలా కష్టం’ అంటూ ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తన సెల్‌ఫోన్ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. ఇది వాస్తవం లాగే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు అనగానే అక్రమాలకు తెర లేపుతున్నారు. దొంగదారిన బెస్ట్ ప్లేస్ కోసం వారు చేయని కుప్పిగంతులు లేవు. ఎలాగైనా తాము కోరుకున్న స్కూల్లో విధులు నిర్వహించాలని తప్పుడు పత్రాలు సృష్టించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే కొంత మంది ఉపాధ్యాయులను గుర్తించిన అధికారులు వారిని తొలగిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నెల 8 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కాగా, ముందుగా పదోన్నతులు చేపట్టారు. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 108 మందికి పదోన్నతి లభించింది. వీరితోపాటు ఎస్జీటీలు, పీఈటీలు, పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే బదిలీలకు వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
టీచర్ల బదిలీల కోసం అధికారులు వెబ్ఆప్షన్ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుడు తాను పనిచేసే ప్రాంతాన్ని బట్టి అతనికి పాయింట్లు కేటాయించడం జరుగుతుంది. రూరల్ ప్రాంతాల్లో పనిచేసే వారికి సంవత్సరానికి 3 పాయింట్లు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి సంవత్సరానికి 2 చొప్పున పాయింట్లు కలుస్తాయి. సీనియర్ ఉపాధ్యాయులకు సైతం కొంతమేర పాయింట్లు కలువనున్నాయి. వీటికితోడు యూనియన్ లీడర్లు, వివాహం కాని మహిళా ఉపాధ్యాయులు, స్పౌజ్, రేషనలైజేషన్, పీహెచ్సీ, ఇతరులు(40 నుంచి 70 శాతం)వికలాంగులు, జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు వచ్చిన వారికి అదనంగా పది పాయింట్లు కలుపనున్నారు. ఎస్ఎస్సీ ఫలితాలు, రిసోర్స్పర్సన్లకు సైతం వారి ప్రావీణ్యాన్ని బట్టి పాయింట్లు కలిపి బదిలీల్లో స్కూళ్లను కేటాయిస్తారు. కానీ, ప్రిపరెన్షియల్ కేటగిరీకి మాత్రం వీరందరి కన్నా ముందు ప్రియార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమాలకు తెర లేపారు. లేని జబ్బులను చూపించి బెస్ట్ స్కూల్లో పోస్టింగ్ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాధికారిని ఫోన్లో వివరణకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.