నల్లగొండ విద్యా విభాగం(రామగిరి), మే 12 : తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ (TPDPMA) గత 40 రోజులుగా చేపట్టిన పరీక్షల బహిష్కరణ సమ్మెను ఈ రోజు విరమించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించవలసిందిగా కోరగా సీఎం సానుకూలంగా స్పందించి డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించినట్లు టీపీడీపీఎంఏ ప్రకటించింది. సమస్య పరిష్కారానికి కృషి చేసిన బాలకిష్టారెడ్డికి ధన్యవాదాలు తెలిపింది.
ఈ సందర్భంగా బాకకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిపారు. విద్యార్థుల పట్ల బాధ్యతతో సమ్మెను విరమించాలని, భవన యజమానులు, అధ్యాపకులు సహృదయంతో కళాశాలల యాజమాన్యాలకి సహకరించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని తెలిపారు. ప్రభుత్వ, ఉన్నత విద్యా మండలి హామీతో పరీక్షల నిర్వహణకు సిద్ధమైనట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు, నీలగిరి విద్యా సంస్థల కరస్పాండెంట్ మారం నాగేందర్రెడ్డి స్పష్టం తెలిపారు.