నల్లగొండ, ఆగస్టు 08 : పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత
మాచన రఘునందన్‌కు జాతీయ స్థాయిలో “హీరో” అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు పర్సనల్ ఇంటర్వ్యూ కోసం ఆదివారం చండీగఢ్‌కు రావాల్సిందిగా సైఫర్ నుంచి తనకు సమాచారం అందింది. శుక్రవారం రఘునందన్ నల్లగొండలో ఈ విషయాన్ని వెల్లడించారు. అవార్డును చండీగఢ్‌కు చెందిన ప్రజారోగ్య, అధ్యయన పరిశోధన సంస్థ స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (సైఫర్) ప్రదానం చేస్తోంది. 15 ఏళ్లకు పైగా పొగాకు నియంత్రణ కోసం విశేష కృషి చేస్తున్న వారికి ఈ అవార్డును సైఫర్ బహూకరిస్తుంది. ఈ క్రమంలో 2025 కు గాను దక్షిణ భారత దేశం తరపున తెలంగాణకు చెందిన నల్లగొండ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్‌కు అవార్డును ప్రకటించారు.
22 ఏళ్లుగా పొగాకు నియంత్రణకు అలుపెరుగని కృషి చేస్తున్న తనను “టుబాకో కంట్రోల్ హీరో” అవార్డుకు ఎంపిక చేయటం పట్ల రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. స్కూళ్లు, కాలేజీల వద్ద పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ మాచన రఘునందన్ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. తదనుగూణంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, గ్రామ పంచాయతీ స్థాయిలో పొగాకు నియంత్రణకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని ఆదేశాలు వెళ్లాయి.