నల్లగొండ రూరల్ , జూన్ 09 : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీ గురుకులల్లో అక్రమంగా, కనీసం విద్యార్హతలు లేకుండా హైదరాబాద్లోని వీఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడిన ల్యాబ్ అటెండర్లు, అటెండర్లను తక్షణమే తొలగించాలని కోరుతూ బీసీ గురుకుల ఆర్సీఓపై జిల్లా కలెక్టర్కు సంఘాల నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ.. బీసీ గురుకులాల్లో ల్యాబ్ అటెండర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపు చదివి ఉండాలన్నారు కాగా కనీసం అర్హత లేకుండా పదో తరగతి కూడా చదవని వ్యక్తులను ల్యాబ్ అటెండర్ గా, అటెండర్లుగా హైదరాబాద్లోని వీఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా అక్రమంగా రిక్రూట్ చేశారని, తక్షణమే వారిని తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఒకవైపు డిగ్రీలు చదివి నిరుద్యోగులుగా రోడ్లమీద తిరుగుతుంటే అర్హత లేని వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల వచ్చిరాని చదువులతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ సెలెక్ట్ చేసినటువంటి ఏజెన్సీని పక్కనపెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాకి సంబంధం లేనటువంటి వీఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో భారీ కుట్ర దాగుందని ఆరోపించారు. తక్షణమే ఆ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి అర్హత లేని వారిని తక్షణమే తొలగించి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మార్గం సతీష్ కుమార్, గడగోజు విజయకుమార్, దీకొండ నవీన్, రాజు, ఉపేందర్ పాల్గొన్నారు.