– ఘనంగా ఎంజీయూ లా కళాశాల ఇండక్షన్ ప్రోగ్రామ్
– హాజరైన జిల్లా జడ్జి వసంత్ పాటిల్, వీసీ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, సెప్టెంబర్ 01 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో (ఎంజీయూ) నూతనంగా ప్రవేశపెట్టిన 3 సంవత్సరాల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మంగళవారం అవగాహన (ఇండక్షన్) కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ లా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆకుల రవి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, నల్లగొండ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి వసంత్ పాటిల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తం రావు హాజరై ప్రసంగించారు.
వృత్తిలో నిబద్ధత, నైపుణ్యం ఉన్నవారికి సమాజంలో మెరుగైన అవకాశాలతో పాటు సంతృప్తికరమైన భవిష్యత్ ఉంటుందని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తం రావు అన్నారు. చట్టబద్ధమైన పాలన సాగడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమైంది. ప్రతి సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి, సంయమనం పాటిస్తూ సమాజాన్ని ఆకళింపు చేసుకున్నప్పుడే సరైన వాదనలు వినిపించడం సాధ్యమవుతుందని తెలిపారు.
న్యాయవృత్తి ద్వారా సమాజానికి విశేష సేవలు అందించవచ్చని జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి వసంత్ పాటిల్ తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, సమగ్ర అధ్యయనం ద్వారా మంచి న్యాయ కోవిదులుగా ఎదిగి శాసనబద్ధ వ్యవస్థ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎంజీయూ నుండి నాణ్యమైన మానవ వనరులు న్యాయరంగంలోకి రావాలని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆకాంక్షించారు. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం విశ్వవిద్యాలయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. లా కళాశాల మంజూరుకు బడ్జెట్, అధ్యాపక పోస్టులతో సహా సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో ఇప్పటివరకు 58 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపాల్ రఘురామారావు, ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ హరీష్ కుమార్, సీనియర్ న్యాయవాదులు ఏ.మురళీధర్ రావు, మునగాల కొండలరావు, అనంతరెడ్డి, వెంకటేశ్వర్లు, దర్శనం నరసింహ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్, విద్యార్థులు పాల్గొన్నారు.