కోదాడ, అక్టోబర్ 08 : కోదాడ గర్వంగా గుర్తుంచుకోతగ్గ ప్రగతిశీల రచయిత శ్రీ శ్రీకుమార్ (శ్రీరామ కవచం శ్రీనివాస కుమార్) ను ఈ నేల మరువదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శ్రీ శ్రీ కుమార్ వృత్తికి అంకితమైన అధ్యాపకుడు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కలంబట్టిన రచయితని కొనియాడారు. గురువారం కోదాడలో శ్రీ శ్రీ కుమార్ సంస్మరణ సభ అధ్యాపకులు, స్నేహితులు, మిత్రుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని చాటి నిలిచిన వాళ్లని రేపటి తరం గుర్తుంచుకుంటుందని తెలిపారు. శ్రీశ్రీ కుమార్ మంచి అనువాదకుడని ప్రపంచానికి పరిచయమయ్యే సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యంలోనే అతి పెద్ద దీర్ఘ కవితను శ్రీ శ్రీ కుమార్ ఆంగ్లంలోకి అనువదించారని, అది త్వరలో వెలుగులోకి రాబోతుందన్నారు.
శ్రీ శ్రీ కుమార్ రాసిన రచనలన్నింటినీ పుస్తకాలుగా తేవటమే ఆయనకు ఇచ్చే నివాళి అవుతుందని జూలూరు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్కృత ఉపాధ్యాయులు చక్రవర్తి అధ్యక్షత వహించగా శ్రీ శ్రీ కుమార్ తండ్రి శ్రీ రామ కవచం వెంకటేశ్వర్లు, తెలుగు అకాడమీ డైరెక్టర్ బట్టు రమేష్, డాక్టర్ జాస్తి సుబ్బారావు, డాక్టర్ అందే సత్యం, గురుకులాల మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పారావు, గిరిజన ఉపాధ్యాయ సంఘాల మాజీ నాయకులు రవిచంద్ర, కేలోజు రమేష్ ,పసుపులేటి విద్యాసాగర్, రాయపూడి చిన్ని, సవితా సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ప్రిన్సిపాల్ శంకర్, పాకనాటి రాఘవరెడ్డి మాట్లాడారు.