– బీఆర్ఎస్వీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రణీత్
నల్లగొండ రూరల్, జనవరి 31 : తెలంగాణ జాతిపిత , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరిట నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ చర్యకు నిదర్శనమని బీఆర్ఎస్వీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రణీత్ కుమార్ శనివారం తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే నాయకుడు కాదని, యావత్ తెలంగాణ సమాజానికి నాయకుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసిన నాయకుడిపై రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ చర్యలకు పాల్పడుతోందన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తప్పక ఎదురయ్యే ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్నట్లు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మున్సిపల్ ఎన్నికలపై నిల్వకుండా చేయడానికే ఈ నోటీసులు జారీ చేశారని విమర్శించారు. ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.