యాదగిరిగుట్ట, మే29: ‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని ఆరోపిస్తూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణిభరత్గౌడ్ను నిలదీశారు. ఆమెను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రూ.2016 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారని, మిగతా రూ.16 ఇవ్వడం లేదని వాపోయారు.
పింఛన్ ఇచ్చే విధంగా చూస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐలయ్య నేడు కనిపించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంపై పింఛన్ పంపిణీ అధికారి జంగయ్యను వివరణ కోరగా మొత్తం రూ.40 లక్షల పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం రూ.10 లక్షలు మాత్రమే వచ్చాయని చెప్పారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి మాట్లాడుతూ మంగళవారం వరకు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఆలేరురూరల్, మే 29: సకాలంలో పింఛన్ అందజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండలంలోని కొలనుపాక ప్రధాన రహదారిపై పింఛన్దారులు ధర్నా చేశారు. కేసీఆర్ హయాంలో సకాలంలో పింఛన్ అందజేసి పెద్దకొడుకులా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా నెలనెలా పింఛన్ అందించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.