యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖల పరిధి జిల్లా యూనిట్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి సూచించారు. మంగళవారం జడ్పీ హాల్లో ఆయన అధ్యక్షతన నిర్వహించి జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. మండల పరిషత్ సమావేశాలకు అధికారులు అందరూ తప్పకుండా హాజరు కావాలని, తద్వారా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయని అన్నారు. గ్రామాల్లో కుల సంఘ భవనాల నిర్మాణాల కోసం ఎన్నికల ముందు ప్రొసీడింగ్‌లు ఇచ్చారని, అసలు ఇప్పుడు అవి ఉన్నట్టా..? లేనట్టా..? అనే స్పష్టం చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. అడ్డగోలుగా ప్రొసీడింగ్‌లు ఇచ్చారని, వీటిపై సమీక్ష జరుపాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సైతం విజ్ఞప్తి చేశారు. పాత ప్రొసీడింగ్‌లు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. నియోజకర్గంలో వంతెనల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని, అసలు నిధులు ఉన్నాయో, లేదో చెప్పాలన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సమావేశాన్ని ఒంటి గంటలోపే ముగించారు. కాగా ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తొలిసారి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ హన్మంతు కె. జెండగే, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.