కోదాడ, ఆగస్టు 06 : గత 15 సంవత్సరాలుగా పలువురు తన వ్యాపార, విద్యా సంస్థలను అబాసుపాలు చేస్తూ తనను, తన కుటుంబ సభ్యులను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని, అయితే తాను వారి బ్లాక్ మెయిలింగ్‌కు తలవంచేది లేదని, సానుకూల పరిష్కారానికి మాత్రం తాను సిద్ధంగా ఉన్నట్లు పారిశ్రామికవేత్త, కోదాడ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు. బుధవారం కళాశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లో కళాశాల నిర్వహణకు తప్పుడు అనుమతులు తెచ్చిన గింజల రమణారెడ్డి, కే వి బి పి కుమార్ ఇప్పుడు తనపై తప్పుడు ధ్రువ పత్రాలతో కళాశాల అనుమతి తెచ్చానని ఆరోపిస్తున్నారన్నారు. అయితే తాను ఏఐసీటీకి వాస్తవ ధ్రువపత్రాలను సమర్పించినప్పటికీ తనపై వ్యక్తిగతంగా కక్ష సాధిస్తూనే ఉన్నట్లు తెలిపారు. ఏఐసిటీకి, జేఎన్టీయూ, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ తనను ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు.
ఈ అంశాలపై నిజ నిర్ధారణకు ఏఐసీటీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటి ఎదుట ఇరువురం అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిపారు. హైకోర్టులో సైతం తనకు సానుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. చివరకు తన కుటుంబాన్ని మట్టు పెట్టేందుకు హైదరాబాద్ నుండి కోదాడకు వస్తున్న క్రమంలో జాతీయ రహదారిపై తన వాహనాన్ని నిలిపి అద్దాలు పగులగొట్టి పెప్పర్ స్ప్రే చల్లి దాడి చేశారన్నారు. ఈ విషయమై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కాంతారావుపై జరిగిన దాడిలో తన ప్రమేయం లేనప్పటికీ కేసులో ఇరికించారని వాపోయారు.
మహిళా ఇంజినీరింగ్ కళాశాలను నిబద్ధతగా నిర్వహిస్తున్నట్లు, ఉమ్మడి జిల్లాలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఏడాది వంద శాతం సీట్లు భర్తీ కావడమే ఇందుకు సాక్షిభూతం అన్నారు. ప్రతి విద్యా సంవత్సరం అడ్మిషన్ల సమయంలో వీరు తప్పుడు ఆరోపణలు చేయటం పరిపాటిగా మారిందన్నారు. తనను, తన కుటుంబాన్ని భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా వేధిస్తున్న గింజల రమణారెడ్డి, కే వి బి పి కుమార్, వెంపటి వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.