నార్కట్‌పల్లి ఆగస్టు 23: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్త్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నకిరేకల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోజురోజుకూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నా ప్రభుత్వం మాత్రం చేతులు ముడుచుకొని కూర్చుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో చెత్తను తరలించే వాహనాలు, డ్రైనేజీ శుభ్రపరిచే సిబ్బంది, దోమల నివారణకు స్ప్రేలు అందుబాటులో ఉంచేవాళ్లమన్నారు. కేసీఆర్ హయాంలో పంచాయతీలకు ట్రాక్టర్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ నాయకులు సొంత పనులకు వాడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చేదన్నారు. చెత్త కుప్పలు తొలగించకపోవడంతో ప్రతి వీధి దుర్వాసనతో నిండిపోయిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరులు కలుషితమవడంతో పిల్లల నుంచి పెద్దవారి వరకు జలుబు, జ్వరం, చర్మ వ్యాధులతో బాధ పడుతున్నారన్నారు. దవాఖానల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. ప్రాథమిక మందులు కూడా అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికార పోరాటాలు, పదవులు పంచాయితీలు, వర్గపోరాటాలకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి పేపర్లు, టీవీల్లో ప్రకటనలకే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప ఒక్క దవాఖానను కూడా సందర్శించిన దాఖలాలు లేవన్నారు. ఇదేనా ప్రజా పాలన…ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుబ్బాక శ్రీధర్, కర్నాటి ఉపేందర్, మల్లెబోయిన సైదులు, పుల్లెంల వెంకన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.