కోదాడ, సెప్టెంబర్ 01 : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మంగళవారం కోదాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఎన్జీవో కోదాడ అధ్యక్షుడు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గడ్డం చిరంజీవి మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ నివేదికను అమల్లోకి తేవాలని, పెండింగ్లో ఉన్న 6 డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట నగేష్, ట్రెజరర్ మహేష్, నాయకులు పులి శ్రీను, పవన్, ముస్తఫా, విక్రమ్, చైతన్య పాల్గొన్నారు.