నీలగిరి, డిసెంబర్ 29: జిల్లాలో చైనా మాం జా (నైలాన్/ప్లాస్టిక్ పూతతో తయారు చేసిన ప్రమాదకర మాంజా) వినియోగం, విక్రయాలపై నిషేధం అమలులో ఉందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చైనా మాంజా కారణంగా పిల్లలు, యువకులు, పాదచారులు, బైక్పై వెళ్లేవారు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా మెడ, ముఖం, చేతులకు గాయాలవుతున్నాయన్నారు.
అలా గే పక్షులు, విద్యుత్ తీగలు, ప్రజల ఆస్తులకు కూడా నష్టం జరుగుతోందన్నారు. చైనా మాంజా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి, దుకాణాలు, గోదాములు, తాతాలిక స్టాళ్లు, ఆన్లైన్ విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో మాంజా బయటపడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని హెచ్చరించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయించడంతో పాటు, దుకాణాలు, గోదాములను సీజ్ చేస్తామన్నారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు.