తుర్కపల్లి,సెప్టెంబర్18 : మండలంలోని చోక్లా తండాలో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు గురువారం ఉదయం తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఎస్సై థక్యూద్దీన్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టి చిన్నారులను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌కు చెందిన మహహ్మద్ రహీమొద్దీన్ కుటుంబంతో పాటు బిహార్‌కు చెందిన పప్పు సుహని కుటుంబాలు బస్వాపుర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా కూలి పనులు చేస్తూ చోక్లా తండాలో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో రహీమొద్దీన్ కుమారులు రెహ్మాన్, (4) ,సుహానీ కుమార్తె ప్రితీ కుమారి(3) ఉదయం తండాలో ఆడుకుంటు తప్పిపోయారు.
దీంతో తల్లిదండ్రులు తండామొత్తం వారికోసం వెతికినా జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తండావాసుల సహకారంతో తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై థక్యూద్దీన్, ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, సీఐ శంకర్‌గౌడ్ సూచనల మేరకు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.
తప్పిపోయిన చిన్నారులను 5గంటల్లోనే భువనగిరి మండలం వడపర్తి గ్రామ సమీపంలో గుర్తించి పట్టుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్ సమక్షంలో తప్పిపోయిన చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారులు ఇద్దదూ క్షేమంగా తమ వద్దకు చేరడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.