కొండమల్లేపల్లి, జూన్ 16: అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా మండల పరిధిలో నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం దుస్థితి. కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన కేజీబీవీ భవన నిర్మాణం పూర్తయి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఏడాదిలో పూర్తి కావాల్సిన కేజీబీవీ భవనం పూర్తి చేసుకోవడానికి నాలుగేండ్లు పట్టగా.. నిర్మాణం పూర్తి చేసుకొని 10 నెలలు గడుస్తున్నా ప్రారంభించి వినియోగంలోకి తేవడానికి మాత్రం అధికారులు వెనుకంజ వేస్తున్నారు. నిర్మాణం పూర్తయిందన్న సంతోషం ఒకవైపు… రేకుల షెడ్డులో తామ పడ్డుతున్న అవస్థలు తీరిపోతాయని అనుకుంటున్న విద్యార్థినుల కల మాత్రం సాకారం కావడం లేదు.
అరకొర వసతులు మధ్య రేకుల షెడ్డులో…
దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్ రేకుల షెడ్డులో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు కేజీబీవీ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆ షెడ్డులో విద్యార్థినులకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల మధ్య విద్యను కొనసాగిస్తున్నారు. తరగతికి 40 మంది విద్యార్థినుల చొప్పున ప్రస్తుతం 190 మంది విద్యనభ్యసిస్తున్నారు. అద్దె భవనం, రేకుల షెడ్డు కావడంతో ఏటా ప్రారంభంలో కొందరు విద్యార్థినులు టీసీలు తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. బడిలో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న మాజీ ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్రెడ్డి దం పతులు సుమారు రూ.3.50 లక్షలు సొంత నిధులు వెచ్చించి కేజీబీవీ పాఠశాలలో సీసీ కెమెరాలు, విద్యుత్, బెంచీలు, మైక్ సెట్ తదితర వసతులు కల్పించారు. అయినప్పటికీ రేకుల షెడ్డు కావడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు.
రూ.3.35 కోట్లతో పనులు
విద్యార్థినుల కష్టాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేజీబీవీ పాఠశాల భవనానికి రూ.3.35 కోట్లు మంజూరు చేసి కొల్ముంతల్ పహాడ్ పంచాయతీ పరిధిలో 2021లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సహకారంతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదటి రెండేండ్లు నిర్లక్ష్యంగా పనులు జరగడంతో స్థానిక నాయకులు, విద్యార్థి సంఘాల ఒత్తడితో గతేడాది ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయి సుమారు పది నెలలు గడుస్తున్నప్పటికీ ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. భవన నిర్మాణం పూర్తయినప్పటికీ, అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం జరుగుతోందని విద్యార్థినుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉదాసీనతను వీడి కేజీబీవీ పాఠశాల భవనాన్ని ప్రారంభించి విద్యార్థినుల కష్టాలు తొలగించాలని కోరుతున్నారు.
కేజీబీవీని వెంటనే ప్రారంభించాలి
కస్తుర్బా గాందీ బాలికల పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాల భవన నిర్మాణానికి రూ.3.35 కోట్ల నిధులు కేటాయించింది. గుత్తేదారుడి నిర్లక్ష్యంతో భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో గత ఆగస్టులో భవన నిర్మాణ పనులు పూర్త్తయ్యాయి. అద్దె భవనంలో అరకొర వసతుల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతున్నందున అధికారులు చొరవ తీసుకొని ఈ విద్యా సంవత్సరంలోనైన కేజీబీవీ పాఠశాలను ప్రారంభించి విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలి.
– రమావత్ లక్ష్మణ్‌నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు