నీలగిరి, అక్టోబర్ 14 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి, శనివారంలోగా గ్రామ, మండల స్ధాయిలో జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించిన అనంతరం తాసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులతో టెలికాన్పెరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీకి గ్రామాల్లో చైర్మన్‌గా గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్ లేదా ప్రత్యేకాధికారి, కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి/వార్డు అధికారితోపాటు స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల నుంచి ముగ్గురితో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గతంలో ఇందిరమ్మ పట్టాలు ఇచ్చి బ్యాంక్ మార్టిగేజ్ నుంచి రిలీజ్ అయిన పట్టాలను మండలాలు, గ్రామాల వారీగా జాబితా రూపొందించాలన్నారు. మండల ప్రత్యేక అధికారి ఈ నెల 16న మండలానికి వెళ్లి పర్యవేక్షించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్ధానికంగానే పరిష్కరించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, వర్షాలకు ధాన్యం తడువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓలు శ్రీదేవి, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.
తేజస్వీనికి అభినందనలు
హైదరాబాద్‌లో ఈ నెల 13న జరిగిన ప్రపంచ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ అండర్-19లో తెలంగాణ జిల్లాల వెయిట్ లిప్టింగ్లో ఛాంపియన్షిప్ సాధించిన కందుల తేజస్వినిని కలెక్టర్, అదనపు కల్టెర్ అభినందించారు. జాతీయ స్ధాయిలో రాణించి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూమ్
వానకాలం ధాన్యం సేకరణ నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. కొనుగోళ్ల సమయంలో ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు, సమాచారం ఉంటే రైతులు 99634 07064 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందని, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.